అమ్మ గుండె ఐతే..నాన్న ఆ గుండె చప్పుడు…తరాలు మారుతున్నట్టే నాన్నల్లో కూడా మార్పులు..వెనుకటి గాంభీర్యానికి బదులు అమ్మ ప్రేమలో సహం తానవుతున్నాడు…
ఏమైనా నాన్న ఎప్పటికీ
“ఎవర్ గ్రీన్ హీరో యే”

ఒకప్పటి తండ్రి
చాలా ముభావంగా, గంభీరంగా ఉండే వారు. ఆయన ఇంటికి వస్తున్నారు అంటేనే పిల్లలు నిశ్శబ్దానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవారు.
ఆదివారం మ్యాట్నీ కి సినిమా కి వెళ్లాలంటే శుక్రవారం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. నాన్న… అందామంటే గొంతులో నుండి ధ్వని కూడా వచ్చేది కాదు. చివరికి చాలా సార్లు ప్రయత్నించి మన వల్ల కాక అమ్మని దగ్గరతీసుకుని అమ్మ ప్లీజ్ అమ్మ అంటే సర్లే నేను మాట్లాడతాలే… అనేది. ఆమె కూడా వెంటనే మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆయన ఏమన్నా అంటే మనం ఎక్కడ బాధపడతామో అని.

చివరికి సినిమాకి అనుమతి వస్తే నాన్న కి ఓ ముద్దు పెడదామంటే కూడా భయమే.. కళ్ళతోటి , ఒక నవ్వుతోటి ఆయన వైపు చూసి అలా వెళ్లిపోయేవాళ్ళము.
కానీ మనకు అప్పట్లో అర్ధం కాలేదు. ఆయనకి మన ప్రయత్నాలు అన్నీ తెలుసు. ముసి ముసి నవ్వులు నవ్వుకునే వారు. ఇది నాకెప్పుడూ తెలిసిందంటే నేను పెద్దయ్యాక మా అమ్మ చెపితే తెలిసింది. కానీ అప్పటికి కూడా మనం ఆయన దగ్గరకు చేరలేకపోయాము.
ఆయన ఒక మేరు పర్వతం… ఎప్పుడు గంభీరంగా ఉంటుంది. ఆయన తనలోని భావాలను, తన ఆలోచనలను కూడా ఎక్కువగా బయటపెట్టే వారూ కాదు. ఒక్కొక్కసారి నాకనిపిస్తుంది వారు ఒక మెకానికల్ లైఫ్ సాగించారు అని.
కాని ఇప్పటి నాన్నల వడిలో కూర్చుంటున్నారు…పిల్లలు. ఇప్పుడు అమ్మలు ఆ పాత్ర తీసుకున్నారేమో అనిపిస్తోంది. అమ్మ చూడండి డాడీ అనే మాటలు ఎక్కువ అయ్యాయి…

పిల్లలకు ఏమన్నా అయితే ఆయన కళ్ళు కూడా వర్షిస్తున్నాయి..ఇంతకుముందు ఏ భావాన్ని బయటపెట్టని నాన్న ఈరోజు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు… నాకు అనిపించింది ఏమిటంటే అమ్మ నాన్న పాత్ర కొంత షేర్ చేసుకుంది అని. నాన్న ని అమ్మ ఊరడిస్తోంది… ఏమి కాదు ధైర్యంగా ఉండండి అని…
కాలం ఎన్నో మార్పులు తెస్తోంది. ఇప్పుడు నాన్న ఓ చిన్న పిల్లాడు. ఎందుకంటే దానికి కూడా ఓ కారణం ఉంది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగుతున్నాయి అందుకే ఒక్క భార్య కి అప్పచెప్పలేక భార్యగా తోడుగా పిల్లలను లాలించటం, ఆడుకోవడం తండ్రి కి ప్రాధాన్యం అయింది. అదే ఆయన లో అన్ని మార్పులు తెచ్చిందేమో…
ఏది ఏమైనా ఇప్పటి నాన్న పిల్లల స్నేహితుడు…