హీరోల భార్యలకి ఓర్పు ఉండాలి. ముఖ్యంగా నాలాంటి రొమాంటిక్ హీరో భార్యకయితే మరీ ఎక్కువుండాలి. చుట్టు పక్కల వాళ్లు, మా స్టార్స్‌లో కొందరు ‘మీ ఆయన ఫలానా హీరోయిన్‌తో భలే యాక్ట్ చేస్తారండీ, చాలా నేచురల్‌గా చేస్తారండీ’ అని నా భార్యను రెచ్చగొట్టేవారు. దానికి ఆవిడ కోప్పడేది కాదు. ‘అలా చేస్తారు కాబట్టే కదండీ మా ఆయనకి రొమాంటిక్ హీరో అని పేరు’ అంటూ నవ్వేసేది. ఎదుటి వాళ్ల ఆలోచనల్ని చదవగలిగే తెలివితేటలు ఉన్నవాళ్లు మాత్రమే అలా మాట్లాడగలరు. లేకపోతే అంతమంది అందమైన హీరోయిన్లతో తన భర్త కలసి నటిస్తోంటే, సన్నిహితంగా ఉంటుంటే… చూసి భరించడానికి ఎంత ఓర్పు ఉండాలి! కరణేషు మంత్రి!పూర్ణ నవలలు బాగా చదివేది. ‘ప్రేమనగర్’ చేయడానికి తనే కారణం. కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల తను చదివింది. చేస్తే బాగుంటుంది, దేవదాసు కంటే పేరొస్తుంది అంది. ఆమె చెప్పింది నిజమే. సినిమా పెద్ద హిట్. అలాగే ‘భార్యాభర్తలు’లో తిరుగుబోతు పాత్ర నాది. సినిమా నిండా పాటలు, డ్యాన్సులు, రొమాన్సులే! నేనా పాత్ర చేయడం కె.వి.రెడ్డికి నచ్చలేదు.‘‘మీరు శ్రీరామచంద్రుడిలా ఉండే వేషాలు వేస్తే బాగుంటుంది, అలాగయితేనే ఆడాళ్లు చూస్తారు, విటుడిగా చేస్తే ఇష్టపడరు’’ అన్నారు. ఆయనలా అన్నారు కదా అని, ఆ సినిమా అన్నపూర్ణకి చూపించాను. ‘‘మీరు రొమాంటిక్ హీరో కదా, ఇలాంటివి ఉన్నా ఆడవాళ్లు ఇష్టపడతారు’’ అంది.

అంత ఆధునికంగా ఆలోచించేది. అలాగే ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’లో నన్ను కృష్ణుడిగా చేయమంటే నేను- ‘‘కృష్ణుడిగా రామారావుకు జనం అలవాటు పడి పోయారు కాబట్టి ఆయననే వేయనివ్వండి. సినిమా బాగా ఆడుతుంది, మీకూ నష్టం రాదు. నాకు అర్జునుడి వేషమివ్వండి చాలు’’ అని సజెస్టివ్గా చెప్పాను. ఆ సినిమా చూశాక అన్నపూర్ణ అంది- ‘‘మీరు రామారావు లేకుండా చెంచులక్ష్మిలో బాగున్నారు. ఎవరి పాత్రలు వారివే కాబట్టి మాయాబజార్‌లోనూ బాగానే ఉన్నారు. ‘భూకైలాస్’లో రామారావుని ఆడించే నారదుడి వేషం కూడా బాగుంది. కానీ ఇందులో మీ ఇద్దరివీ ఢీ అంటే ఢీ అనే పాత్రలు. ఆయనముందు మీరు నిలబడలేక పోతున్నారు. ఆయనకంటే మీ వాయిస్ వీక్‌గా ఉంది, ఆయనముందు మీ పర్సనాలిటీ కూడా వీక్‌గానే ఉంది. అందుకే ఇకమీదట ఇలాంటి పాత్రలు చేయవద్దు.’’ నేను ఆశ్చర్యపోయాను! తను అంత బాగా అనలైజ్ చేయగలదన్నమాట! మొదటిసారి కాదంది!మా ఇద్దరికీ ఎప్పుడూ పెద్దగా గొడవలు రాలేదు కానీ ఒక్కసారి మాత్రం గొడవ పడ్డాం… గుడివాడ కాలేజీకి లక్ష రూపాయలిచ్చి నప్పుడు! అదే గుడివాడలో నేను చెప్పుల్లేకుండా నడిచినరోజుల్లో నన్ను ఆశీర్వదించిన పెద్దలు వచ్చి కాలేజీ కోసం లక్ష రూపాయలు విరాళం ఇవ్వమని అడిగారు. అప్పటికి నేను సినిమాకి పదిహేను వేలు తీసుకుంటున్నాను.చాలా సినిమాలు చేశాను గానీ వెనకేసుకున్నది కేవలం లక్ష రూపాయలే. ఎందుకంటే ఆదాయపు పన్ను చాలా ఎక్కువ ఉండేది! దాంతో ఎక్కువ డబ్బు మిగిలేది కాదు. అయినా ఇస్తానన్నాను. అప్పుడే మొదటిసారి పూర్ణ నన్ను వ్యతిరేకించింది. ‘‘ఇద్దరు పిల్లలున్నారు, మూడో బిడ్డ కడుపులో ఉంది, ఒక్క ఇల్లు తప్ప మనకంటూ ఏమీ లేదు, లక్ష రూపాయలు ఎలా ఇచ్చేస్తారు’’ అని ప్రశ్నించింది. ‘‘నేను కారు నడుపుతున్నాను. ఎప్పుడు బ్రేక్ వేయాలో నాకు తెలుసు. నువ్వు వెనక సీట్లో కూర్చున్నావు. అయినా ఎప్పుడేం జరుగుతుందోనని భయపడి బ్రేకు వేయమంటున్నావ్’’ అన్నాన్నేను. ఎందు కంటే అప్పటికి నేను మంచి డిమాండ్‌లో ఉన్నాను. కనీసం మరో ఏడెనిమిదేళ్లు సంపాదిస్తాను.

‘‘చదువు సంధ్యలు లేకుండా వీధుల్లో తిరిగిన నాలాంటివాడు ఇవాళ ఇలా ఉన్నాడంటే వాళ్లంతా ఆశీర్వదించి పంపడం వల్లే. వాళ్లు నోరు తెరిచి అడిగినప్పుడు ఇవ్వనంటే ఎలా?’’ అన్నాను. ‘‘అయినా సరే, ఓసారి ఆలోచించండి’’ అంది. నేను పట్టు వదల్లేదు. ఎలాగో తనని ఒప్పించాను. ఇదంతా తన మాట వినకూడదనీ కాదు, అది నేను సంపాదించిన డబ్బు అన్న అహమూ కాదు. ఒకప్పుడు నాటకాలు వేసేవాడినని, సినిమావాడినని తక్కువగా చూశారు. పిల్లనివ్వడానిక్కూడా వెను కాడారు. సినిమాల్లో నటించినంత మాత్రాన చెడిపోతామా? ఉద్యోగాలు చేసేవాళ్లు చెడిపోరా? అయినా వాళ్లు చెడిపోకపోవడం గొప్ప కాదు. చెడిపోవడానికి ఇన్ని అవకాశాలు ఉండి కూడా మేం చెడిపోలేదంటే… అది గొప్ప! మమ్మల్ని అలా అంచనా వేస్తారు కాబట్టే, మా దగ్గరకొచ్చి ఏదైనా అడిగినప్పుడు చేయలేనని అనకూడదని నా ఉద్దేశం! అప్పుడు తప్ప ఏరోజూ దేనికీ పూర్ణ నాకు అడ్డు చెప్పలేదు. నా కోసం ఇది చెయ్యండి అని కోరలేదు. తనే నాకోసం చాలా చేసింది. స్టూడియో కడదామను కునేటప్పటికి పిల్లలింకా మైనర్లే. తనని సలహా అడిగితే ‘ఏమీ ఆలోచించొద్దు, వెంటనే మొదలు పెట్టేయండి’ అంది. ఆ సమయంలో నాకున్న అండ తనొక్కతే. తనే లేకుంటే నేనేమీ చేయగలిగేవాడిని కాదు! తన బాధ చూడలేకపోయాను!తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఆస్తులు, గుణాలు, రూపం ఎలా వస్తాయో… అలా అనారోగ్యం కూడా వస్తూ ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ల నాన్న మైగ్రెయిన్‌తో చాలా అవస్థపడేవాడు. అది పూర్ణకు పదమూడేళ్లకే వచ్చింది. పిల్లలు పుట్టి బ్లడ్‌లో మార్పు వస్తే పోతుందేమో అనుకున్నాం. కానీ పోలేదు. మెనోపాజ్ వచ్చాక పోవచ్చన్నారు. అప్పుడూ పోలేదు. అలాగే వాళ్ల నాన్నమ్మకు డయాబెటిస్ ఉంది. అది ఈమెకి పద్దెనిమిదేళ్లకే వచ్చింది. వాళ్ల తాతగారికి ఆర్థరైటిస్ ఉంది. ముప్ఫయ్యేళ్లకే ఈమెకీ వచ్చింది. వీటన్నిటికీ మందులు వాడీ వాడీ చివరకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దాంతో చలాకీగా తిరుగుతూ అన్నీ చక్కబెట్టిన పూర్ణ చక్రాల కుర్చీకి పరిమితమవ్వాల్సి వచ్చింది. అన్నిటా తానై అందరినీ సాకిన ఆమెకు మరొకరి సాయం అవసరమయ్యింది. అలా చాలా యేళ్లు ప్రత్యక్ష నరకాన్ని చవి చూసింది. రోగం తన శరీరాన్ని నమిలేస్తుంటే, ఆమె పడుతున్న బాధ నా మనసును మెలిపెట్టేది.