బద్వేలుకు ఆర్డీఓ కార్యాలయం మంజూరు
నిండు కుండలా బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు
లీకేజీలు లేకుండా రూ.45 కోట్లతో పనులు
ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ కటాఫ్ వాల్ నిర్మాణం
దీంతో ఎల్లప్పుడూ ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రకటన
బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు
రూ.500 కోట్లకు పైగా వ్యయంతో పనులకు శ్రీకారం
రూపురేఖలు మారనున్న నియోజకవర్గం
బద్వేలు బహిరంగ సభలో సీఎం శ్రీ వైయస్ జగన్
బద్వేలు:
అనంతపురం, వైయస్సార్ జిల్లాల పర్యటనలో ఉన్న సీఎం శ్రీ వైయస్ జగన్, రెండో రోజు ఇడుపులపాయ నుంచి నేరుగా బద్వేలు చేరుకున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలా ఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
బద్వేలు బహిరంగ సభలో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రసంగం:
బ్రహ్మంసాగర్ ఏనాడూ నిండలేదు:
‘బద్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో వెనబడిన వాటిలో ఒకటి. ఇవి రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. అలా వెనకబడిన వాటిలో బద్వేలు నియోజకవర్గం ఒకటి. గతంలో ఈ నియోజకవర్గానికి ఏనాడూ మంచి జరిగిన పరిస్థితి లేదు. నేను 2009లో ఎంపీగా ఎన్నికయ్యాక, చాలా సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నాకనిపించేది.. నాన్నగారి హయాంలో మాత్రమే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో 14 టీఎంసీల నీళ్లు నిల్చాయి.. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఎందుకు నాలుగైదు టీఎంసీలకు మించి నీరు నిల్వ లేవు అని ఎప్పుడూ అనిపించేది. కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. పాలకుల్లో మంచి చేయాలన్న తపన, ఆలోచన లేదు’.
మరి ఈ రెండేళ్లలో పరిస్థితి:
‘అదే బద్వేలు నియోజకవర్గం. అదే బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఈ రెండు సంవత్సరాలలో మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో మళ్లీ నిండు కుండలా కనిపిస్తోంది. ఎప్పుడూ ఈ ప్రాజెక్టు అలా నిండు కుండలా ఉండాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించే విధంగా అడుగులు వేశాం’.
ఇందు కోసం ఏమేం చేశాం?:
‘వెలుగోడు నుంచి 0 నుంచి 18 కి.మీ వరకు కాలువ సక్రమంగా లేదు. లైనింగ్ లేకపోవడం వల్ల నీళ్లు కిందికి రావడం లేదు. ఇది అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే అధికారంలోకి రాగానే రూ.300 కోట్లు మంజూరు చేసి లైనింగ్ పనులు మొదలు పెట్టాం. దాదాపు 80 శాతం లైనింగ్ పనులు పూర్తి కాగా, మిగిలినవి అక్టోబరు నాటికి పూర్తి అయి, నీళ్లు నేరుగా సులభంగా ఈ రిజర్వాయర్‌కు వచ్చే వీలు కలుగుతుంది. ఇదే బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండు కుండలా ఉండేందుకు అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే కుందూనది మీద లిఫ్ట్ కట్టాలని రూ.600 కోట్లు మంజూరు చేసి పనులు కూడా మొదలు పెట్టాం. 2 ఏళ్లలో అవి పూర్తవుతాయి. దాంతో బ్రహ్మంసాగర్‌ఎప్పుడూ నిండు కుండలా ఉంటుందని మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను’.
బద్వేలుకు మోక్షం:
‘ఇక్కడ (బద్వేలు నియోజకవర్గం) దాదాపు రూ.500 కోట్లకు పైగా నిధులతో వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. అవన్నీ పూర్తైతే ఇక్కడ రూపురేఖలన్నీ మారుతాయి’.
‘మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఇక్కడ బద్వేలు పట్టణంలో దాదాపు రూ.130 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. సుమారు 143 కి.మీ పొడవుతో కొత్తగా సీసీ రోడ్లు, మూడు పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అధునాతన కూరగాయల, చేపల మార్కెట్‌తో పాటు, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో పాటు, ఆరు స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నాం. రూ.130 కోట్లతో జరిగే ఈ అభివృద్ధి పనుల వల్ల బద్వేలు నియోజకవర్గానికి ఎంతో మంచి జరుగుతుందని మనసారా నమ్ముతున్నాను’.
సాగు నీటి సదుపాయం:
‘అదే విధంగా రూ.80 కోట్లతో లోయర్ సగిలేరు ప్రాజెక్టు, ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా సులభంగా నీరు నింపవచ్చు. దీని కోసం రూ.80 కోట్లు ఆనందంతో ఖర్చు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.
అదే విధంగా బ్రహ్మంసాగర్‌ఎడమ, కుడి కాల్వల పెండింగ్ పనుల కోసం రూ.54 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం. దీని వల్ల సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి సామర్థ్యంతో నీరందించవచ్చు’.
నీటి లీకేజీ లేకుండా..:
‘మరోవైపున బహ్మంసాగర్ ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రమ్ కటాఫ్ వాల్ నిర్మాణం పనులు రూ.45 కోట్లతో ఇవాళ మొదలు పెడుతున్నాం. ఎందుకుంటే నిండు కుండలా జలాశయం నిండితే లీకేజీలు కనిపించాయి. కాబట్టి ఈ మరమ్మతులు చేపట్టాం. దీని వల్ల ప్రాజెక్టులో మొత్తం 17 టీఎంసీలు ఎప్పుడూ నింపుకోవచ్చు. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను’.
పెరగనున్న ఆయకుట్టు:
‘ఇంకా రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్ జలాశయం ఎడమ కాలువలో మూడు ఎత్తిపోతల పథకాలకు ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. దీని వల్ల అక్షరాలా 8,268 క్యూబిక్ లీటర్ల నీటిని, సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి చెరువులను పూర్తిగా నింపడంతో పాటు, కాశినాయన మండలంలో సుమారు 3500 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చు. ఈ మంచి కార్యక్రమానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం’.
నాణ్యమైన విద్యుత్ సరఫరా:
‘రూ.10 కోట్లతో 5 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 5 సబ్ స్టేషన్ల నిర్మాణం. ఇది ఇక్కడి వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుంది. విద్యుత్ సరఫరాలో నాణ్యత చాలా పెరుగుతుంది’.
రహదారుల విస్తరణ–రవాణా సదుపాయం:
‘పోరుమామిళ్ల పట్టణంలో 3.6 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లకు రూ.25 కోట్లతో విస్తరణ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. దీని వల్ల పోరుమామిళ్ల చక్కగా మారుతుంది. మరో రూ.22 కోట్లతో సగిలేరు నది మీద వేములూరు గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన. దీని వల్ల 30 గ్రామాల ప్రజలకు రవాణ సదుపాయం కలుగుతుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో సగిలేరు నది మీద రూ.9.5 కోట్లతో వంతన నిర్మాణం పనులు ఇవాళ మొదలు. కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు, ప్రకాశం జిల్లాకు రాకపోకలు మెరుగవుతాయి’.
గోదాముల నిర్మాణం:
‘బద్వేలు మార్కెట్ యార్డులో రైతుల కోసం 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక గోదాము, పోరుమామిళ్లలోని మార్కెట్ యార్డులో కూడా 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రూ.7.5 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం’.
ఆలయాల అభివృద్ధి:
‘బద్వేలులో శ్రీ ప్రసన్న వెంటటేశ్వర ఆలయం, శ్రీ ఆదికేశవ దేవాలయంతో పాటు, కాశినాయన మండలంలో మరో 6 దేవాలయాల అభివృద్ధి కోసం దాదాపు రూ.4.7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ పనులకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం’.
బద్వేలులో ఆర్డీఓ ఆఫీస్:
‘ఇక్కడ ఎప్పటినుంచో ఒక డిమాండ్. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం కావాలని అడుగుతున్నారు. ఆ ఆఫీస్ కోసం కాశినాయన, కలసపాడు మండలాల వారు ఎంతో దూరంలో ఉన్న రాజంపేటకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అక్కడి వారు రాజంపేటకు వెళ్లి రావడానికి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి వస్తోందని, ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కావాలని కోరారు. అందుకే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్‌ను మంజూరు చేస్తున్నానని తెలియజేస్తున్నాను’.
అవన్నీ శాంక్షన్ చేస్తున్నాను:
ఇంకా రూ.34 కోట్ల విలువైన చిన్న చిన్న పనులను మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కోరారన్న సీఎం శ్రీ వైయస్ జగన్, అవన్నీ శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
– ఆర్ అండ్ బీ బంగ్లా మరమ్మతులు. రూ.5 కోట్లు.
– పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులతో పాటు, శిధిలావస్థలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు రూ.15 కోట్లు.
– బద్వేలు మండలంలో వీరబల్లి, కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం రూ.50 లక్షలు.
– బద్వేలు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్.
ఎంత చేసినా తక్కువే:
‘ఈ నియోజకవర్గం అత్యంత వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ఎంత చేసినా తక్కువే. ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ నా మీద ఎంతో ఆదరణ చూపారు. తమ బిడ్డలా ఆప్యాయత చూపారు. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేస్తున్నాను.
చివరగా..:
‘మీ అందరి ఆప్యాయతకు మీ ఆదరాభిమానాలకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వ, తాతకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.
పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.