*సైనిక లాంచనాలతో అంత్యక్రియలు
*నివాళ్లు అర్పించిన హోం మంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి
* కుటుంబ సభ్యులకు 50 లక్షల చెక్ అందచేత
దేశ సరిహద్దు లో ఎదురు కాల్పలలో అశువులు బాసిన వీర జవాన్ జస్వంత్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం లో వేలాది జనం మధ్య సైనిక లాంఛనాలతో వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు ఘనంగా ముగిశాయి. కొత్తపాలెంలోని ఆయన నివాసం నుంచి నిర్వహించిన అంతిమ యాత్రకు స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కొత్తపాలెం శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగింది.
జై జవాన్, జశ్వంత్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలతో ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జాతీయ పతాకం చేత పట్టుకుని ఆ వీర సైనికుని దేశ భక్తిని గుర్తు స్మరించుకున్నారు. అంతియ యాత్ర గంటకు పైగా సాగింది. జశ్వంత్ కు గౌరవ సూచకంగా ఆర్మీ సిబ్బంది.. గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబీకులు.. వారి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను పూర్తి చేశారు. అశ్రునివాళి నడుమ.. జశ్వంత్ కు అంతిమ వీడ్కోలు పలికారు.

వీర జవాన్ జస్వంత్ రెడ్డి మృతదేహానికి హోం మంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి , జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని లు నివాళ్లు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అతి చిన్న వయసులోనే జశ్వంత్ మరణించడం బాధాకరమని అని హోం మంత్రి సుచరిత విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన జశ్వంత్ త్యాగం మరువలేనిదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై సీఎంతో మాట్లాడతానని చెప్పారు. .
*తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు*
జమ్ము సరిహద్దుల్లో రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందారు. ఆ యువ సైనికుడి మృతదేహాన్ని మద్రాస్ రెజ్మెంట్ సైనికులు ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తీసుకువచ్చారు.
మృతదేహం బాపట్ల సీరోడ్ కూడలికి చేరుకున్న తర్వాత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కొత్తపాలెం వరకూ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. మాజీ సైనికులు ర్యాలీ చేపట్టారు. ‘జశ్వంత్ రెడ్డి అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు.
మరికొద్ది రోజుల్లో జశ్వంత్ రెడ్డికి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించాడంటూ.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016 లో సైనికునిగా జశ్వంత్.. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించారు. అనంతరం జమ్మూకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు.