బెంగళూరులో భారీ భూ కుంభకోణం: ₹100 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం! అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు! బెంగళూరు భూమి కుంభకోణం
బెంగళూరు భూమి కుంభకోణం; బెంగళూరు: యశ్వంతపుర నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అన్ని చట్టాలను ఉల్లంఘించి ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చిన భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. ఈ అవినీతికి పాల్పడిన అధికారులపై పూర్తి ఆధారాలతో లోకాయుక్తలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.
బీబీఎంపీ (BBMP) మాజీ అధికార పక్ష నేత, అవినీతి నిరోధక వేదిక అధ్యక్షుడు రమేష్ ఎన్. ఆర్. ఈ అక్రమాలను బహిర్గతం చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
కుంభకోణం వివరాలు: బెంగళూరు సౌత్ తాలూకా, తావరేకెరె హోబ్లి పరిధిలోని కురుబరహళ్లి గ్రామం సర్వే నంబర్ 158 లో ఉన్న 130.29 ఎకరాల భూమి పూర్తిగా “ప్రభుత్వ గోమాళం” (ప్రభుత్వ భూమి). ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ ₹800 కోట్లకు పైమాటే. అయితే, ఈ అత్యంత విలువైన భూమిలో సుమారు 10 ఎకరాల 20 గుంటల (10:20 ఎకరాలు) భూమిని నకిలీ పత్రాల ద్వారా అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చారు. దీని విలువ కనీసం ₹100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్, 1964 మరియు ఎ. టి. రామస్వామి కమిషన్ నివేదిక నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి రాధా బాలకృష్ణ అనే ప్రభావవంతమైన వ్యక్తి మరియు ఇతరుల పేరిట ఖాటాలు సృష్టించారు. ఈ అవినీతిలో అప్పటి ప్రత్యేక తహశీల్దార్ కృష్ణమూర్తి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మోనిష్, విలేజ్ అకౌంటెంట్ నంజేగౌడ, డీడీఎల్‌ఆర్ సుజయ్, మాగడి ప్లానింగ్ అథారిటీ చైర్మన్ ప్రకాష్‌లు లంచాలు తీసుకుని అక్రమ పత్రాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
